మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి పర్యటన — అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన

మంగళగిరి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి శ్రీమతి నారా బ్రాహ్మణి బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. లక్ష్మీ శారీస్ & డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ ప్రారంభం మంగళగిరి పట్టణం గోలివారివీధిలో దామర్ల వేణు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ శారీస్ & డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ ను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి నారా బ్రాహ్మణి లాంఛనంగా ప్రారంభించారు. పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికిన అనంతరం, మంగళవాయిద్యాల మధ్య రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభించిన ఆమె, చేనేత వస్త్రాలను పరిశీలించారు. డిజైన్ల వివరాలు, చేనేత రంగానికి అందుతున్న మద్దతు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ...