మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి పర్యటన — అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన
మంగళగిరి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి శ్రీమతి నారా బ్రాహ్మణి బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
లక్ష్మీ శారీస్ & డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ ప్రారంభం
మంగళగిరి పట్టణం గోలివారివీధిలో దామర్ల వేణు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ శారీస్ & డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ ను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి నారా బ్రాహ్మణి లాంఛనంగా ప్రారంభించారు.
పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికిన అనంతరం, మంగళవాయిద్యాల మధ్య రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభించిన ఆమె, చేనేత వస్త్రాలను పరిశీలించారు. డిజైన్ల వివరాలు, చేనేత రంగానికి అందుతున్న మద్దతు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. "చేనేతకు పూర్వ వైభవం తీసుకురావడమే మా లక్ష్యం" అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. అనంతరం చేనేత చీర కొనుగోలు చేశారు.
కాజ గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్ర సందర్శన
కాజ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ సహకారంతో నడుస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ను సందర్శించిన ఆమె, శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి, వారి పనిని ప్రశంసించారు. "మహిళల ఆర్థిక సాధికారతకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయి" అన్నారు. అనంతరం మహిళలతో గ్రూప్ ఫోటో దిగారు.
ఎస్ఎల్ఎన్ కాలనీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్క్ పరిశీలన
0.35 ఎకరాల్లో రూ.1.06 కోట్ల వ్యయంతో మంత్రి నారా లోకేష్ అభివృద్ధి చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్క్ ను పరిశీలించిన ఆమె, పార్క్ అందాలను ఆస్వాదించారు. స్థానికులతో మాట్లాడుతూ, సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సరదాగా ఊయల ఊగారు కూడా.
ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ పరిశీలన
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దిగువ సన్నిధిలో దివిస్ లేబరేటరీస్ సహకారంతో ఏర్పాటుచేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను పరిశీలించి, నిర్వహణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎగువ సన్నిధికి భక్తులను ఉచితంగా తీసుకెళ్లే ఎలక్ట్రిక్ బస్సు ను కూడా పరిశీలించి, ప్రయాణిస్తున్న భక్తులతో మాట్లాడారు.
ఈ పర్యటనలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి