మంగళగిరి | రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలతో ఆత్మీయంగా గడిపిన మంత్రి నారా లోకేష్
రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు, ఉండవల్లి నివాసానికి విచ్చేసి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారికి రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ, “నాకు సొంతంగా అక్కలు, చెల్లెళ్లు లేరు. మంగళగిరి మహిళలు నా అక్కాచెల్లెళ్లు. మీరందించిన ఆశీస్సులు నాకు కొండంత బలాన్నిచ్చాయి. మీ ఆశీస్సులతో మంగళగిరిని రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను” అని అన్నారు.
మంత్రివర్యులు మాట్లాడుతూ, 2019లో తొలిసారి పోటీ చేసినప్పుడు 5,300 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసినా, ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో పనిచేసి, గత ఎన్నికల్లో రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీతో విజయం సాధించానని గుర్తుచేశారు. ఎన్నికల హామీలలో ముఖ్యమైన ప్రభుత్వ భూముల్లో నివసించే వారికి శాశ్వత ఇళ్ల పట్టాలు అందించడంలో తొలి ఏడాదిలోనే దాదాపు 3 వేల మందికి పైగా వెయ్యికోట్ల విలువైన ఆస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
అలాగే మంగళగిరిలో 200 అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. వీటిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజి, విద్యుత్ మరియు గ్యాస్ పైప్‌లైన్లు, 100 పడకల ఆసుపత్రి, స్వర్ణకారుల కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, శ్మశాన వాటికల నిర్మాణం, పార్కుల అభివృద్ధి వంటి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, మంగళగిరి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని, ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం కష్టపడతానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి